10-రోజుల్లోనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్
10 రోజుల్లో
పంచాయతీ నోటిఫికేషన్-- డిసెంబర్15 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి
-- బీసీలకు పార్టీపరంగా 42ు రిజర్వేషన్ ఇచ్చేద్దాం
-- క్యాబినెట్ భేటీలో సీఎం ప్రతిపాదన
-- అంగీకారం తెలిపిన మంత్రులు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-18:రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతోంది.ఆ క్రమంలో చూస్తే..పది రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది.తొలుత గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో ఆ మేరకు కసరత్తు ప్రారంభమైంది.ప్రస్తుతం అమల్లో ఉన్న 23 శాతం బీసీ రిజర్వేషన్, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోపు ఉండేలా.. గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రత్యేక కమిషన్‌ను ప్రభుత్వం కోరనుంది.ఈ కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి వారం రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ల జాబితా అందిన రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంటే పది రోజుల్లో గ్రామాల్లో ఓట్ల పండగ ప్రారంభం కానుందన్నమాట.ఈ ఎన్నికలు పార్టీ రహితం అయినప్పటికీ.. పార్టీ తరఫున సర్పంచ్, వార్డు అభ్యర్థులుగా పోటీ చేసే వారిలో కనీసం 42ు మంది బీసీలు ఉండాలని,గరిష్ఠంగా 60 శాతం వరకు అవకాశం ఇద్దామని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ ఎన్నికలు నిర్వహించకుంటే ఆర్థిక సంఘం నిధులు రూ.3 వేల కోట్లు మురిగిపోనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు.ఆ నేపథ్యంలోనే డిసెంబరు 15 కల్లా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి నిధుల కోసం ఆర్థిక సంఘానికి ప్రతిపాదన పంపుదామని తెలిపారు.పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం శక్తివంచన లేకుండా కృషి చేద్దామన్నారు.స్థానిక ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టు స్పందనను బట్టి.. వచ్చే క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.గెలుపు ప్రాతిపదికనే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు.ఈ అంశాలపై రేవంత్ మంత్రులందరి అభిప్రాయాలనూ తెలుసుకున్నారు. రూ.3 వేల కోట్ల నిధులతో ముడిపడిన అంశం కావడంతో అందరూ సీఎం ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. దీంతో పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబరు 8, 9 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రజాభవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అలాగే డిసెంబరు మొదటి వారంలో నిర్వహించే ప్రజాపాలనా విజయోత్సవాల నిర్వహణపైనా సమీక్ష జరిపారు. తదుపరి క్యాబినెట్ సమావేశం ఈ నెల 29న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సమగ్ర విద్యుత్తు విధానంపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు.
--- జూబ్లీహిల్స్ విజయం స్ఫూర్తితో ముందుకు....
మంత్రివర్గ సమావేశం అనంతరం.. అధికారులను పంపేసి మంత్రులు విడిగా సమావేశమయ్యారు.ఆ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయంపై చర్చించారు.ఈ గెలుపుతో ప్రభుత్వ పనితీరుకు ప్రజామోదం లభించినట్లయిందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీకి, ప్రభుత్వానికి పట్టు పెరుగుతోందని.. ముస్లింలు, బీసీలు, సెటిలర్ల రూపంలో పార్టీకి బలమైన ఓటుబ్యాంకూ ఏర్పడిందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు.ఉప ఎన్నికలో మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు చక్కటి పనితీరు కనబరిచారని సీఎం అభిప్రాయపడ్డారు.

Comments
Post a Comment