వీడిన ఉత్కంఠ..కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బిజెపి కైవసం

వీడిన ఉత్కంఠ..

కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం

జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... 



కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది.ఆ క్రమంలో చూస్తే..బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. మరోవైపు అంజిరెడ్డి విజయంపై ఎన్నికల అధికారులు మరికాసేపట్లో ప్రకటన చేయనున్నారు.

కాగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా, నేనా? అన్నట్లు సాగింది. రెండ్రోజులుగా సాగుతున్న కౌంటింగ్‌తో నేడు విజేత ఎవరనేది తేలిపోయింది. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్నీ సొంతం చేసుకుంది. అయితే ఓట్ల లెక్కింపు రెండ్రోజులుగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. మెుదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలకపోవడంతో రెండో రౌండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. నిన్న(మంగళవారం) రాత్రి 12 గంటల వరకూ ఆరు రౌండ్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి కన్నా 6,931 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరసగా ఐదు రౌండ్లు ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 6, 7వ రౌండ్లలో మాత్రం వెనకబడింది. ఆరో రౌండ్‌లో నరేందర్‌రెడ్డి 211 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఏడో రౌండ్‌లో నరేందర్‌రెడ్డికి 600 పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించింది.

అయితే నేడు సాగిన ఓట్ల లెక్కింపులో అదృష్ఠం బీజేపీ అభ్యర్థిని వరించింది. దీంతో మెుదట్నుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలపై ఒక్కసారిగా పిడుగుపడినట్లు అయ్యింది.కాగా,కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం వద్ద బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి